విరమణకు షరతులు | Iran rejected a US ceasefire offer and has laid out its own list of conditions | Sakshi
Sakshi News home page

విరమణకు షరతులు

Mar 26 2026 3:25 AM | Updated on Mar 26 2026 4:39 AM

 Iran rejected a US ceasefire offer and has laid out its own list of conditions

ఇరాన్‌కు అమెరికా 15 ప్రతిపాదనలు 

అంగీకరిస్తే నెల పాటు కాల్పుల విరమణ

తిరస్కరించిన ఇరాన్, అమెరికాకు 8 షరతులు 

ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టికరణ 

కొనసాగిన ఇజ్రాయెల్, ఇరాన్‌ పరస్పర దాడులు 

అబ్రహంలింకన్‌ యుద్ధ నౌకపై దాడి: ఇరాన్‌ 

మందెబ్‌ జలసంధినీ మూసేస్తానని హెచ్చరిక 

కువైట్‌ విమానాశ్రయంలో భారీ మంటలు

దుబాయ్‌/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఈ విషయమై ఇరాన్‌ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 

ముఖ్యంగా అణు, క్షిపణి కార్యకలాపాలను కట్టిపెట్టడం, హార్మూజ్‌పై పెత్తనాన్ని వదులుకోవడం, హెజ్బొల్లా వంటి సాయుధ గ్రూపులకు ఆర్థిక, ఆయుధ సాయం నిలిపివేత వంటి షరతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదని కుండబద్దలు కొట్టింది. హార్మూజ్‌పై తన సార్వ¿ౌమాధికారాన్ని గుర్తించాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ‘‘మాపై ఇంకెప్పుడూ యుద్ధానికి దిగరాదు. ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి. మా నేతలు, సైనికాధికారుల హత్యలను మానుకోవాలి’’అంటూ అమెరికాకు 8 షరతులు విధించింది! గల్ఫ్‌ నుంచి అమెరికా బలగాలన్నీ వైదొలగాలని కూడా స్పష్టం చేసింది. 

మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్‌ పరస్పర దాడులు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో కొనసాగాయి. గల్ఫ్‌ దేశాలపై కూడా ఇరాన్‌ డ్రోన్‌ దాడులను కొనసాగించింది. అమెరికా కూడా మరో 5,000 మంది మెరైన్లు, 1,000 మంది సైనికులను గల్ఫ్‌ ప్రాంతానికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలను చర్చలకు ఒప్పించేందుకు పలు దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన పట్ల ఇజ్రాయెల్‌ విస్మయం వెలిబుచ్చింది. ఇరాన్‌ పూర్తిగా కాళ్లబేరానికి వచ్చేదాకా దాడులు కొనసాగించాలని అభిప్రాయపడింది. మరోవైపు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ యత్నాలకు ఈజిప్టు, టర్కీ కూడా ముందుకొచ్చాయి. 

కొనసాగుతున్న చర్చల యత్నాలు 
అమెరికా, ఇరాన్‌ నడుమ చర్చల దిశగా పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇరుదేశాలు అంగీకరిస్తే వాటి నడుమ ద్వైపాక్షిక చర్చలకు వేదికగా నిలిచేందుకు పాకిస్తాన్‌ సిద్ధమని ఆ దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తన 15 షరతులను పాక్‌ ద్వారానే ఇరాన్‌కు అందజేసినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. అయితే వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ఇరాన్‌ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్‌ ప్రకటించింది. యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించాల్సింది ఇరానే తప్ప ట్రంప్‌ కాందంటూ మండిపడింది. అంతేగాక ఇరాన్‌ కూడా 8 షరతులతో కూడిన తమ ప్రతిపాదనలను పాక్‌ ద్వారానే అమెరికాకు పంపింది. 

వాటన్నింటికీ అంగీకరిస్తేనే యుద్ధానికి తెర దించడంపై నిర్ణయం తీసుకుంటామంటూ కుండబద్దలు కొట్టింది. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని పునరుద్ఘాటించింది. గల్ఫ్, పరిసర దేశాల మంత్రులు తదితరులు తమతో మాట్లాడుతున్నట్టు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ చెప్పుకొచ్చారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు మాత్రం అబద్ధమని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బఘెర్‌ ఖలీబాఫ్‌ అన్నారు. ట్రంప్‌ మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొ చ్చారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్, తన అల్లుడు జెరేద్‌ కుష్నర్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వాటిలో పాల్గొంటున్నట్టు వైట్‌హౌస్‌లో మీడియాకు వెల్లడించారు. ఎలాగోలా ఒప్పందానికి రావాలనే ఇరాన్‌ ఆశ పడుతున్నట్టు కూడా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.  

అమెరికా ఎఫ్‌–18 కూల్చివేత! 
ఇరాన్, ఇజ్రాయెల్‌ పరస్పర దాడులు బుధవారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్‌పై తీవ్రస్థాయిలో బాంబులు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధ నౌకపైనా దాడి చేసింది. దానిపైకి పలు క్షిపణులను ప్రయోగించింది. దాడిలో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు చెప్పుకొచ్చింది. ఈ నౌకపై దాడి చేసినట్టు ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, అమెరికా ఖండించడం తెలిసిందే. కువైట్‌ విమానాశ్రయంపైనా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. దాంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన ఎఫ్‌–18 యుద్ధ విమానంపై క్షిపణితో దాడి చేసినట్టు ఇరాన్‌ పేర్కొంది! ఇందుకు సంబంధించి వీడియో కూడా విడుదల చేసింది. అంతేగాక తమపై దాడులు కొనసాగితే యెమన్‌ సమీపంలోని బబ్‌ ఎల్‌ మందెబ్‌ జలసంధిని కూడా మూసేస్తానంటూ ఇరాన్‌ తాజాగా హెచ్చరికలు చేసింది. ఇది యెమన్, ఎరిత్రియా నడుమ ఉన్న 32 కి.మీ. వెడల్పుతో కూడిన జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్, హిందూ మహాసముద్రాలతో 
కలుపుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement