పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణల్లో తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధ వర్గాలు విడుదల చేసిన ప్రకటనల్లో.. “ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించే ప్రతి చర్యకు సమాధానం ఉంటుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. హర్ముజ్ సమీపంలోని అమెరికా బలగాలు, సముద్ర మార్గాల్లో కదులుతున్న మిలిటరీ కార్యకలాపాలపై తమ నిఘా కొనసాగుతోందని ఇరాన్ పేర్కొంది.
మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్‌లోని కొన్ని సైనిక కేంద్రాలపై రాత్రికి రాత్రే కొత్త వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్‌లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పలు ఇరానియన్ డ్రోన్‌లను గాల్లోనే కూల్చివేసినట్లు కూడా అమెరికా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న వేళ.. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడం పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తోంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వ మీడియా “హర్ముజ్‌లో సంయుక్త నిర్వహణ, ఆంక్షల సడలింపు” వంటి అంశాలతో ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “హర్ముజ్ తెరిచే ఉంటుంది.. నియంత్రణ అమెరికా మిత్రదేశాల భద్రతకే ప్రాధాన్యం” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కలవరపడుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ చిన్న ఉద్రిక్తత జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.
రష్యా, చైనా వంటి దేశాలు ఇరు పక్షాలు అదుపు పాటించాలని పిలుపునిస్తుండగా.. ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా చూస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో “ఇది నిజంగా శాంతి ప్రయత్నమా? లేక యుద్ధానికి ముందు వ్యూహాత్మక ఒత్తిడా?” అన్న చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా హర్ముజ్‌పైనే నిలిచింది. ఎందుకంటే అక్కడి ప్రతి కదలిక ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది.


