ఇజ్రాయెల్ దాడితో లెబనాన్‌లోని టైర్ సిటీలో ధ్వంసమైన వాహనాలు, భవంతులు
ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర బాంబుల వర్షం కనిపించని ట్రంప్ ‘యుద్ధ విరామ’ప్రభావం
రెండు ఇంధన వ్యవస్థలకు భారీ నష్టం: ఇరాన్
బాంబుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్
టెల్ అవీవ్‌పై భారీ దాడులకు దిగిన ఇరాన్
బహ్రెయిన్‌పై డ్రోన్ దాడుల్లో సైనికుని మృతి
యూఏఈలో ఒక కాంట్రాక్టర్ మరణం
గంటల తరబడి చీకట్లో మగ్గిన కువైట్
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్‌కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.
దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్‌తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది.
చమురు క్షేత్రాలకు నష్టం
ఇరాన్‌లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్‌లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్‌లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్‌లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది.
టెల్ అవీవ్‌లో విధ్వంసం
ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్‌లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.
పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్‌లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి.
ఇజ్రాయెల్‌లో 16కు పెరిగిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్‌లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు.
యుద్ధ నెపం హెగ్సెత్‌పై!
దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్‌పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.
‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్‌పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్‌కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్‌పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు.


