ఇరాన్‌ కొత్త ప్రతిపాదన నచ్చలేదు  | Iran hands over new proposal for talks with US to end war | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ కొత్త ప్రతిపాదన నచ్చలేదు 

May 2 2026 5:36 AM | Updated on May 2 2026 5:36 AM

Iran hands over new proposal for talks with US to end war

ఏం జరుగుతుందో చూద్దాం  

తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  

వాషింగ్టన్‌: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్‌ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్‌ ప్రపోజల్‌ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్‌ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. ఇరాన్‌ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ విలేకరులతో అన్నారు. 

అమెరికా, ఇరాన్‌ మధ్య ఫోన్‌ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్‌ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. 

ఇరాన్‌తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్‌ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్‌ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేసింది. దీనిపై ఇరాన్‌ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది.  

మాతో ఒప్పందానికి ఇరాన్‌ తహతహ 
పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్‌ తహతహలాడుతోందని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్‌లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్‌ బదులిచ్చారు. 

అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్‌ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్‌ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్‌ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్‌ తేల్చిచెప్పారు.  

ఈయూ వాహనాలపై సుంకాల పెంపు
యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు.  

ఇరాన్‌పై యుద్ధం ముగిసింది: అమెరికా 
వాషింగ్టన్‌: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్‌(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్‌ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్‌ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement