టెహ్రాన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో యూఎస్ భీకర దాడులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ కూడా హెచ్చరించడంతో ఇరాన్ పలు ప్రణాళికలు వేసుకుంది. ఇరాన్ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ హారాలుగా ఏర్పాటు చేయనుంది.
ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాల వద్దకు యువత చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు సహా యువత అంతా మంగళవారం విద్యుత్ మౌలిక వసతుల వద్దకు చేరాలని ఇరాన్ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ చెప్పింది. ఉద్రిక్తతల సమయంలో ప్రజల ఐక్యతను చూపించడమే లక్ష్యమని అధికారులు చెప్పారు.
ఇది ఇరాన్ యువత సూచనే..
ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహిమీ తెలిపారు. “యువతే ఈ సూచన చేసింది. కొంతమంది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయం లేదా మానవ హారంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు” అని చెప్పారు. దేశ మౌలిక వసతులను రక్షించడంలో యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా ఈ నిర్ణయం నిలుస్తుందని ఆశిస్తున్నామని రహిమీ అన్నారు.
హార్మూజ్ జలసంధిని తెరవడానికి ట్రంప్ మంగళవారం రాత్రి వరకు గడువు ఇచ్చారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే కఠిన సైనిక చర్యలు తీసుకుంటామని, ముఖ్య మౌలిక వసతులపై దాడులు జరగవచ్చని ట్రంప్ హెచ్చరించారు. ఆ గడువు దాటాక ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా విరుచుకుపడతాయని తెలుస్తోంది.
మరోవైపు, ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 12 గంటల పాటు రైళ్లు వినియోగించవద్దని చెప్పింది. దీంతో డెడ్‌లైన్ ముగియగానే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ విరుచుకుపడతాయన్న భయం మరింత పెరిగింది.


