టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ ప్రతిగా కౌంటరిస్తోంది. ట్రంప్ బెదిరింపులకు అసలు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీంతో, యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే, హార్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. తాజాగా ఇరాన్ సైనిక కమాండ్ మాట్లాడుతూ..‘ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. ట్రంప్ బెదిరింపులు వారి సైనిక వైఫల్యాల ఫలితం. అవి మా దాడులను ఆపలేవు. పశ్చిమాసియాలో అమెరికా ఎదుర్కొన్న అవమానాన్ని కూడా చెరపలేవు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ నౌకపై క్షిపణి దాడి చేసింది. దీంతో అది ధ్వంసమై భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అలాగే టెల్ అవీవ్, హైఫా, బీర్ షెవా వంటి ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అమెరికా కూడా చెందిన నౌక ఎల్హెచ్ఏ-7 కూడా దాడులకు గురై, మహాసముద్రంలోనే వెనుదిగాల్సి వచ్చింది. కువైట్‌లోని అమెరికా స్థావరాలు, బాగ్దాద్‌లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని సైనిక కమాండ్ ప్రతినిధి హెచ్చరించారు. అంతకుముందు కూడా ఇరాన్.. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. మద్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరించింది. యుద్ధం ఆపాలంటూ అమెరికాకు పది షరతులు విధించింది.
మరోవైపు.. డెడ్‌లైన్ తర్వాత ఇరాన్‌కు గడువు పొడిగింపు అసంభవమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్..‘మంగళవారం ఇరాన్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటాం. ఇరాన్ మొత్తం తుడిచిపెట్టకుపోవచ్చు. ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలం. ఇరాన్‌లో మా వెపన్ సెక్షన్ ఆఫీసర్‌ను కాపాడుకున్నాం, పైలట్‌ను రక్షించాం, ఎఫ్-15 యుద్ధ విమానం నుంచి పైలట్‌ను రక్షించాం. శత్రు ప్రాంతాల్లోకి ఎఫ్-15 యుద్ధ విమానం చొచ్చుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పైలట్‌ను కాపాడగలిగాం’ అని అన్నారు.


