
బీజింగ్: ఇప్పటికే దశాబ్దాలుగా చైనా, రష్యాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తున్న జిన్‌పింగ్, పుతిన్‌లకు ఇంకొన్ని దశాబ్దాలపాటు అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవాలనే ఆశ ఉన్నట్టుంది. బుధవారం బీజింగ్‌లో కట్టుదిట్టమైన మిలటరీ భద్రత మధ్య జరిగిన సైనిక, సాయుధ పరేడ్‌లో వీరిద్దరి అనూహ్య సంభాషణ ఈ విషయాన్ని రుజువుచేసింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో జిన్‌పింగ్, పుతిన్‌ల గుసగుసలు దగ్గర్లోని మైక్రోఫోన్ ద్వారా బయటకు వినిపించడంతో వీరి మనసులోని మాట బయటపడింది.
తియాన్మెన్ స్క్వేర్ గేట్ నుంచి పరేడ్ వీక్షణ వేదిక మీదకు వెళ్లే మార్గంలో నడుచుకుంటూ జిన్‌పింగ్, పుతిన్, కిమ్, ఇతర నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా 150 ఏళ్లదాకా మనిషి జీవించగలడు అనే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో పుతిన్.. ‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’ అని అన్నారు.
దీనికి జిన్‌పింగ్ మాండరిన్ భాషలో బదులిచ్చారు. ‘గతంలో 70 ఏళ్లు బతకడం అంటే గగనం. ఇప్పుడు 70 ఏళ్లు వయసు వచ్చిన చిన్నపిల్లాడి కిందే లెక్క. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అభివృద్ధిలోకి వస్తున్న వైద్యశాస్త్ర పరిశోధనా ఫలాలను అందిపుచ్చుకుంటే ఈ శతాబ్దిలోనే మనుషులు 150 ఏళ్లదాకా జీవించగలరు’’ అని అన్నారు. ఇదే సమయంలో జిన్‌పింగ్, పుతిన్‌లను చూసి కిమ్ కిసుక్కున నవ్వారు. వీళ్ల సంభాషణ విని నవ్వారో, ఊరకే యథాలాపంగా నవ్వారో తెలీదు.
కానీ ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా ప్రత్యక్షప్రసారమైందని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి వయసూ 72 కావడం గమనార్హం. తదుపరి ఎన్నికల్లోనూ అధ్యక్ష పీఠంపై కూర్చునేలా జిన్‌పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులుచేశారు. పుతిన్ సైతం ఇదే తరహాలో గతంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. ఇద్దరికీ మరికొన్నాళ్లు పరిపాలించాలనే ఆసక్తి ఎక్కువగా ఉందని అందరికీ తెల్సిందే.