 
													ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.
అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.
ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
