
టోక్యో: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్‌సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు.
అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు తియాంజిన్‌కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్‌లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.
భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్‌సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.