ట్రంప్‌ పన్నుల ఎఫెక్ట్‌.. అమెరికాతో కీలక ఒప్పందం | India clarification on tax treaty with the US | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ పన్నుల ఎఫెక్ట్‌.. అమెరికాతో కీలక ఒప్పందం

Jun 2 2026 4:43 AM | Updated on Jun 2 2026 4:48 AM

India clarification on tax treaty with the US

ఢిల్లీ: భారత్, అమెరికా దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం  మొదటి విడతకు సంబంధించిన అంశాలు దాదాపు ఖరారయ్యాయన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతం చర్చలు కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులు, కామాలు, ఫుల్‌స్టాప్‌ల పైనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అమెరికా విధించే కొత్త సుంకాల విషయంలో భారతదేశం తన ప్రత్యర్థి దేశాల కంటే ఎక్కువ ప్రయోజనం పొందేలా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు, ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న రెండు దర్యాప్తులకు (సెక్షన్ 301 కింద) సంబంధించిన సవాళ్ల అంశం సైతం  చర్చించనున్నారు. ఈ కొత్త ఒప్పందం ద్వారా 140 బిలియన్ డాలర్ల విలువైన భారత్-అమెరికా వాణిజ్య బంధం ఒక కొత్త ముసాయిదా వైపు అడుగులు వేయనుంది.

ఈ అంశంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "దాదాపు ప్రతిదీ ఖరారైంది. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్  చెప్పినట్లుగా 99శాతం అంశాలు ఖరారయ్యాయి. ఇప్పుడు చిన్నచిన్న విషయాలు, కామాలు, ఫుల్‌స్టాప్‌లపైనే చర్చలు జరుగుతున్నాయి. తుది ఒప్పందాన్ని ఖరారు చేసేటప్పుడు, అమెరికాలో జరిగిన చట్టపరమైన మార్పులను ఇందులో ఎలా ప్రతిబింబించాలి దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది." అని అన్నారు.

ట్రంప్ ప్రభుత్వం అత్యవసర నిబంధనలను ఉపయోగించి గతంలో విధించిన "పరస్పర సుంకాల" ను అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, కొత్త సుంకాల యంత్రాంగంపై స్పష్టత వచ్చిన తర్వాత అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. 

ప్రస్తుతానికి ఒప్పంద పత్రాన్ని సిద్ధంగా ఉంచి, కొత్త సుంకాలు ఖరారైన వెంటనే రేట్లను ఖరారు చేయాలనేది ఇరుదేశాల వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వాణిజ్య చర్చల బృందం ఈ రోజు మంగళవారం  నుండి ఢిల్లీలో ప్రారంభం కానున్న మూడు రోజుల చర్చల కోసం ఇదివరకే రాజధానికి చేరుకుంది.

   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement