
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా చేతిలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి.. చావో రేవో అనే పరిస్థితికి చేరింది. ఈ ఓటములను పాక్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ఈ తరుణంలో పాక్ క్రికెట్ మాజీ దిగ్గజం, పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) అధినేత ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లో ఇకనైనా గెలవాలంటే.. ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని, అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఫయాజ్ ఈసా, ఎలక్షన్ కమిషనర్ రాజా ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలాగే.. థర్డ్ ఎంపైర్‌గా ఇస్లామాబాద్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని సూచించారు. పీసీబీ రాజకీయాల వల్లే పాక్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వెటకారంగా పై వ్యాఖ్యలు చేశారాయన.
ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాక్ జట్టు ఓటమిపై(Pak Lost To India) ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాగైతే భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో ప్రణాళిక, నిబద్ధత లేకుండా గెలుపు ఊహించలేం అని అన్నారాయన. ఇష్టుల్ని సెలక్టర్లుగా పెట్టడం, గ్రూప్‌ల రాజకీయాలు, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడం.. కీలక స్థానాల్లో అర్హతలేని వారిని పెట్టడం వల్లే పతనం అయ్యిందనన్నారు. నఖ్వీ అసమర్థత, బంధుప్రీతి(నెపోటిజం) వల్లే పీసీబీకి ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పీసీబీ రాజకీయాలకు పుల్‌స్టాప్ పడాలని, ఆటగాళ్లు తమ తలపొగరు తగ్గించుకోవాలని.. టాలెంట్ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు.
పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్(Ex PM Imran Khan) పలు కేసుల్లో అరెస్టై రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. దీంతో ఇమ్రాన్ తరఫున ఆయన సోదరి అలీమా ఖాన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. పీసీబీతో పాటు పాక్‌లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు అన్యాయంగా, పక్షపాతంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారాయన. పాక్ ఎన్నికల్లో పీటీఐ ఓడిపోలేదని.. ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయ నేతలతో చేతులు కలిపి మోసం చేశారని నిందిస్తున్నారాయన.
పాక్ క్రికెట్‌ను మలుపు తిప్పిన ఆటగాడిగా ఇమ్రాన్ ఖాన్‌కు ఓ పేరుంది. ఆల్ రౌండర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే 1992లో పాకిస్తాన్ ప్రపంచ కప్ నెగ్గింది. 88 టెస్ట్ మ్యాచ్‌లు, 175 వన్డేలు ఆడిన ఆయన ఎన్నో విజయాలను అందించారు. తన సారథ్యంలోనే పాక్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, కొత్త తరం క్రికెటర్లను పరిచయం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగానే 2010లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం ఆయనకు దక్కింది.
1996లో పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2018 సాధారణ ఎన్నికల్లో విజయంతో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే.. 2022లో విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయి.. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీటీఐని పోటీ చేయకుండా అప్పటి కోర్టులు, ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అయినప్పటికీ వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే కౌంటింగ్‌లో తొలి రౌండ్లలో వాళ్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆపై ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను ఆపేసి గందరగోళం సృష్టించి మరీ ఫలితాలు తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఆ సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఇదీ చదవండి: పాక్‌కు డెడ్‌చీప్‌గా అప్పులు ఇస్తున్న దేశం ఏదో తెలుసా?