పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..
దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది.
ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.
ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.
ప్లాన్‌బీ లేనే లేదు!
అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్‌లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.


