గూగుల్‌ కంపెనీ భారీ ప్రయోగం | Google Plan: 32 Million Mosquitoes to Fight Disease Carrying Mosquitoes | Sakshi
Sakshi News home page

గూగుల్‌ కంపెనీ భారీ ప్రయోగం

Jun 1 2026 9:07 AM | Updated on Jun 1 2026 9:46 AM

Google Plan: 32 Million Mosquitoes to Fight Disease Carrying Mosquitoes

సాధారణంగా గూగుల్‌ అంటే సెర్చ్‌ ఇంజిన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అత్యాధునిక టెక్నాలజీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అదే గూగుల్‌ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఓ ప్రమాదకరమైన ప్రజారోగ్య సమస్యపై దృష్టి సారించింది. ‘ముల్లును ముల్లుతోనే’ దెబ్బ తీసేలా కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఈ వినూత్న ప్రయోగం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దాని వెనుక ఉన్న శాస్త్రం, దాని లక్ష్యం, గతంలో నమోదైన ఫలితాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

గూగుల్‌ మాతృసంస్థకు చెందిన పరిశోధనా విభాగం డీబగ్‌ ప్రాజెక్ట్‌(Debug Project) అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ 3.2 కోట్ల మగ దోమలను విడుదల చేయడానికి అనుమతి కోరింది. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

అయితే ఇవి సాధారణ దోమలు కావు. ప్రత్యేకంగా ల్యాబ్‌ల్లో పెంచినవి!. పైగా వోల్బాషియా పైపెంటిస్‌( Wolbachia pipientis) అనే బ్యాక్టీరియాతో సంక్రమింపజేసిన మగ దోమలు. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు ఏర్పడతాయి. కానీ ఆ గుడ్లు పొదగవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టవు. అలా.. కొంతకాలానికి మొత్తం దోమల జనాభా క్రమంగా తగ్గిపోతుంది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కుట్టేది ఆడ దోమలే. మగ దోమలు మనుషుల జోలికి పోవు . కాబట్టి లక్షలాది దోమలను విడుదల చేసినా ప్రజలకు అదనపు ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగని.. ఈ ప్రాజెక్ట్‌ కొత్తది కాదు. గూగుల్‌ 2014లోనే డీబగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

మలేరియా, డెంగీ, జికా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. గత పదేళ్లుగా ప్రయోగశాలలు, పరిమిత ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పెద్ద స్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది.

నిజానికి దోమలపై ఇలా "వంధ్యీకరణ యుద్ధం" చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి పద్ధతులను ఇప్పటికే ప్రయోగించారు. అమెరికాలో ఆక్సిటెక్‌ (Oxitec) అనే బయోటెక్‌ సంస్థ జన్యుమార్పిడి చేసిన దోమలను విడుదల చేసి మంచి ఫలితాలు సాధించింది. బ్రెజిల్‌, పనామా, కేమన్‌ దీవుల్లో నిర్వహించిన ప్రయోగాల్లో లక్ష్య దోమల జనాభా 80-90 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి.

అంతేకాదు, దశాబ్దాల క్రితమే ఇదే సూత్రాన్ని ఉపయోగించి మెడిటేరియన్‌ ఫ్రూట్‌ ఫ్లై(Mediterranean Fruit Fly) అనే పంటల శత్రువైన ఈగలను, అలాగే పశువులకు ప్రమాదకరమైన న్యూవరల్డ్‌ స్క్రూవార్మ్‌(New World Screwworm) పురుగులను కూడా అనేక దేశాలు విజయవంతంగా నియంత్రించాయి. అంటే ఈ పద్ధతి పూర్తిగా కొత్తది కాకపోయినా, దోమల నియంత్రణలో ఇంత భారీ స్థాయిలో వినియోగించేందుకు ప్రయత్నించడం మాత్రం విశేషం.

ఖర్చు విషయానికొస్తే.. గూగుల్‌ ఖచ్చితమైన సంఖ్యలను వెల్లడించలేదు. అయితే గతంలో డీబగ్‌ ప్రాజెక్ట్‌, సంబంధిత పరిశోధనల కోసం ఇప్పటికే వందల మిలియన్‌ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు టెక్‌, బయోటెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయోగశాలల్లో కోట్లాది దోమలను పెంచడం, వాటిని వేరు చేయడం, బ్యాక్టీరియాతో సంక్రమింపజేయడం, అనంతరం విడుదల చేయడం వంటి ప్రక్రియలు భారీ వ్యయంతో కూడుకున్నవే.

అయితే గూగుల్‌కు కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. ఈ భారీ ప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి . ప్రకృతిలో ఇంత భారీ స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న ప్రశ్నలు పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్నారు. దోమల జనాభా తగ్గితే వాటిపై ఆధారపడే ఇతర జీవులపై ప్రభావం పడే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రజారోగ్య నిపుణులు మాత్రం దీనిని ఆశాజనక ప్రయోగంగా చూస్తున్నారు. 

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ సమస్యను రసాయనాలపై ఆధారపడకుండా, ప్రకృతి సూత్రాలనే ఉపయోగించి నియంత్రించగలిగితే అది ప్రజారోగ్య రంగంలో పెద్ద ముందడుగుగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న దోమలపై "మగ దోమల సైన్యం" నిజంగా విజయం సాధిస్తే.. భవిష్యత్తులో డెంగీ, మలేరియా నియంత్రణకు కొత్త దారి చూపే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement