
కాఠ్మండ్: జెనరేషన్ జెడ్ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్ పరిస్థితులు కుదుట పడుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీని నియమించాలని ఆందోళనకారులు ప్రతిపాదనలు పంపినట్లు ఆదేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ తెలిపారు. దీంతో సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం అనివార్యం కానుంది. ఆమె నియామకంపై అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.
సుశీలా కార్కీ ఎవరు?
సుశీలా కార్కీ 2016 జూలై నుండి 2017 జూన్ వరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నేపాల్ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి మహిళ. 1970లలో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. తాజాగా,నేపాల్‌లో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సుశీలా కార్కీ తన పదవీకాలంలో అవినీతిపై పోరాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో.. మహిళలు తమ పిల్లలకు పౌరసత్వ హక్కులు ఇవ్వగలగడం. ఇది నేపాల్‌లో లింగ సమానత్వం దిశగా కీలక అడుగులు పడేలా చేసింది. ఈ తీర్పుతో సుశీలా కార్కీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా వచ్చినప్పటికీ..ప్రజా వ్యతిరేకతతో అది వెనక్కి తీసుకున్నారు.
ఆమె సమర్ధురాలు
నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఆ దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా నియమిస్తే బాగుంటుందని జెన్‌జీ భావిస్తోంది. నేపాల్ రాజకీయ సంక్షోభ సమయంలో పాలనను గాడినపెట్టడం,పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆమె నాయకత్వం సరైందని భావిస్తున్నారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాతో..దేశాన్ని నిష్పాక్షికంగా ముందుకు నడిపించగల నాయకురాలు ఆమెనేంటూ నేపాల్ పౌరులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.
బాలెన్ షా కాదు.. సుశీలా కార్కీ
తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కీ పేరు ప్రతిపాదనకు ముందు.. కాఠ్మండూ మేయర్ బాలెన్ షా తన పదవికి రాజీనామా చేసి, నాయకత్వం వహించాలని సోషల్ మీడియాలో నేపాల్ ప్రజలు కోరారు. బాలెన్ మేయర్‌గా ఉన్న కాలంలో చేసిన పని ఏమీ లేదు. కానీ, బాలెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కలిసివచ్చింది. దీనికి తోడు 2022 కాఠ్మండూ మేయర్ ఎన్నికల్లో మహామహుల్ని మట్టికరిపించారు. స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగినా మేయర్‌గా గెలుపొందారు. ఇలా తాజా నేపాల్ అనిశ్చితితో బాలెన్‌షా పేరు తెరపైకి వచ్చింది. అయినప్పటికీ అనుభవం రిత్యా జస్టిస్ సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని జెన్‌జీ తరం కోరుకుంటోంది. ఆ దిశగా చర్చలవైపు అడుగులేస్తోంది.