
విద్యుత్ బోర్డ్ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ వైపు ఒక వర్గం మొగ్గు
నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలకు మరో వర్గం మద్దతు
దేశాధ్యక్షుడు పౌదెల్, ఆర్మీ చీఫ్‌తో కొనసాగుతున్న చర్చలు
కాఠ్మండు: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఆగ్రహం ధాటికి నేపాల్ ప్రభుత్వం కుప్పకూలగా సుస్థిర పాలన అందించే సారథి ఎంపికలో జెన్‌జెడ్ విద్యార్థి సంఘం తర్జనభర్జనలు పడుతోంది. ఈలోపు జెన్ జెడ్ విద్యార్ధుల్లో బేధాభిప్రాయాలు పొడచూపాయి. కొందరు విద్యుత్ బోర్డ్ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ వైపు మొగ్గుచూపారు. మరికొందరు మాత్రం నేపాల్ మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ మాత్రమే సమర్థపాలన అందించగలరని వాదించారు.
ఈ వాదనల నడుమే ఉమ్మడిగా జన్‌జెడ్ విద్యార్థి బృందం దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్‌తో భద్రకాళీ ప్రాంతంలోని సైనిక ప్రధాన కార్యాలయంలో గురువారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ఎవరిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేయాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జెన్‌జెడ్, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. మరోదఫా చర్చలు జరిపే అవకాశం ఉంది.
‘‘ప్రస్తుత అనిశ్చితికి చరమగీతం పాడే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ అంశం సైతం చర్చకొచ్చింది’’అని నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని తనను ఎవరూ ఇంతవరకు కోరలేదని జస్టిస్ సుశీల తెలిపారని ఆమె సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అంతకుముందు ఆమెనే ప్రధాని పదవి చేపట్టాలని ఆన్‌లైన్‌లో వేలాది మంది పోల్‌లో ఓటేశారు. అయితే నేపాల్ రాజ్యాంగ నియమాల ప్రకారం మాజీ న్యాయమూర్తులు ప్రధానమంత్రి వంటి కీలక పదవులు చేపట్టేందుకు అనర్హులు.
మరోవైపు కాఠ్మండు నగర మేయర్, జనాల్లో అమితమైన ఆదరణ చూరగొన్న బాలేంద్ర షా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయనకు ప్రధాని వంటి అత్యున్నత పదవులు చేపట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. జస్టిస్ సుశీలకు బాలేంద్ర మద్దతు పలకడం విశేషం. ‘‘తొలుత మేం బాలేంద్ర షా వైపు మొగ్గుచూపాం. ఆయన అందుకు సంసిద్ధంగా లేరని సమాచారం వచ్చింది. దాంతో మేం జస్టిస్ సుశీలను ఎంపికచేయాలని భావించాం.
అయితే జడ్జీల ఎంపిక కుదరదని, అందుకే రాజ్యాంగం ఒప్పుకోదని తేలింది. ఇక ధారన్ మున్సిపాలిటీ మేయర్ హార్క్ సంపంగ్‌ను ప్రధాన అభ్యరి్థగా ఆశించాం. కానీ ఆయనకు పెద్దగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. దీంతో విద్యుత్ అథారిటీ సంస్థ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ ఇందుకు తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాం’’అని జెన్‌జెడ్ ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే సుశీల నాయకత్వం మాకు సమ్మతమే అని ‘వీ నేపాలీ గ్రూప్’సారథి, ఉద్యమకారుడు సుదన్ గురుంగ్ ప్రకటించారు.
ఆర్మీ కార్యాలయం ఎదుట బాహాబాహీ
ఓవైపు జెన్‌జెడ్ కీలక నేతలు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో దేశాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్‌లతో మంతనాలు జరుపుతుంటే బయట జెన్ జెడ్ విద్యార్థులు ఘర్షణలకు దిగారు. సుశీల సమర్థురాలు అని కొందరు, ఘీసింగ్ గొప్ప వ్యక్తి అంటూ మరికొందరు వాదనలకు దిగారు. తర్వాత వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో జెన్ జెడ్ వర్గంలో విబేధాలు బట్టబయలయ్యాయి.
‘‘సుశీల కేసులనైతే గొప్పగా తీర్చుచెప్పగలిగారేమోగానీ పరిపాలన అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ఆమె 70 ఏళ్ల వృద్దురాలు. ఈ వయసులో ఆమె క్రియాశీలక పాత్ర పోషించడం చాలా కష్టం’’అనికొందరు వాదించారు. మరికొందరు ఘీసింగ్‌కు మద్దతు పలికారు. ‘‘రోజుకు 18 గంటలపాటు విద్యుత్‌కోతలుండేవి. ఎలక్ట్రిసిటీ అథారిటీ బోర్డ్ సీఈఓగా ఘీసింగ్ సమర్థవంతంగా పనిచేశారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన విద్యుత్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు’’అని మరికొందరు వాదించారు. దీంతో ఇరువర్గాల మధ్య నడిరోడ్డు మీద గొడవ మొదలైంది.
అధికారంపై ఆర్మీ ఆసక్తి!
అధికారంపై ఆర్మీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జెన్‌జెడ్ ప్రతినిధి బృందంతో అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ చర్చలు జరుపుతున్నప్పుడే వివాదాస్పద వ్యాపారవేత్త దుర్గా ప్రసాయ్ వచ్చారు. దేశంలోని రాజరిక పాలన మళ్లీ తేవాలని ఆయన గట్టిగా విశ్వసిస్తారు. ఈయనతోపాటో రాష్రీ్టయ స్వతంత్ర పారీ్ట(ఆర్‌ఎస్పీ)ని సైతం ఈ చర్చల్లో భాగస్వాములుగా చేర్చుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని ఆర్మీ చీఫ్ అశోక్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం.
తమ కనుసన్నల్లో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటు జరగాలనే ఉద్దేశ్యంతోనే వ్యాపారి, రాజకీయ పారీ్టలను ఇందులోని ఆర్మీ లాగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో దుర్గా ప్రసాయ్ జోక్యాన్ని సహించని జెన్ జెడ్ విద్యార్థులు వెను వెంటనే చర్చలను అర్ధంతరంగా ఆపేసి బయటకు వచ్చేశారని తెలుస్తోంది. ‘‘మాతో చర్చలకు పిలిచి మధ్యలో దుర్గా ప్రసాయ్, ఆర్‌ఎస్పీలను కలుపుకుని పొండి అని ఆర్మీ చీఫ్ చెప్పడం ఏమాత్రం సబబుగా లేదు. విద్యార్థి ఉద్యమాన్ని తక్కువచేసి చూపిస్తున్నారు’’అని విద్యార్థి నేత రక్షా బామ్ తర్వాత మీడియాతో అన్నారు. చర్చలు ఎటూ తేలకపోవడంతో ఆర్మీ చీఫ్ చైనాలో తన వారంరోజుల పర్యటనను తప్పనిపరిస్థితుల్లో రద్దుచేసుకున్నారు.