
అంతరిక్షంలో రేడియోధార్మికత ప్రభావాన్ని విశ్లేషించేందుకు సాయపడనున్న ఫ్రూట్ ప్ల్రై
ఆగ్జియమ్ స్పేస్ మిషన్‌లో పండుటీగలను తీసుకెళ్లనున్న వ్యోమగాముల బృందం
ప్రతిష్టాత్మకమైన స్పేస్ మిషన్‌ల ద్వారా అంతరిక్షంలోకి చేరుకున్న ఉదంతాలను గుర్తుచేసుకుంటే నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్ కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేశ్ శర్మ మనకు స్మరణకు వస్తారు. తాజాగా అయితే శుభాన్షు శుక్లా కూడా గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విశిష్ట అతిథి వచ్చేశారు. అదే ప్రూట్ ఫ్లై. అంటే పండుటీగ!
గతంలో ఎన్నోసార్లు ప్రయోగశాలల్లో ఎన్నో పరిశోధనలకు తన వంతు సాయం అందించిన పండుటీగ ఇప్పుడు అంతరిక్షం దాకా ఎగరనుంది! ఆగ్జియం స్పేస్ మిషన్ బృందం పండుటీగలను కూడా అంతరిక్షంలోకి పంపనుంది. అంతరిక్షంలో వ్యోమగాములకు ప్రమాదకరంగా మారిన రేడియోధార్మికత డీఎన్‌ఏను ధ్వంసం చేస్తోంది. ఈ సమస్యకు పండుటీగలతో పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లే ఆగ్జియమ్–4 మిషన్‌లో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా బృందంతోపాటు పండుటీగలు సైతం ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నాయి.
ఏం ప్రయోగం చేయబోతున్నారు?
పండుటీగలు అత్యంత వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. దీంతో వీటిని అంతరిక్షంలో రేడియోధార్మిక ప్రభావానికి లోను చేస్తే రేడియేషన్ వాటిని ఏ స్థాయిలో నాశనం చేస్తుంది?. దాన్ని తట్టుకుని అవి ఎంతవరకు మనగల్గుతాయి? డీఎన్‌ఏను పునరుద్ధరించుకోగలవా? అలా డీఎన్‌ఏ మరమత్తులు సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలకు వ్యోమగాములు సమాధానాలు వెతకనున్నారు.
ఇందుకోసం పండుటీగలను, వాటి లార్వాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్తున్నారు. రేడియేషన్ తర్వాత పండుటీగలు ఎలాంటి ప్రొటీన్లను ఉత్పత్తిచేసి డీఎన్‌ఏ రిపేర్లు చేసుకునే అవకాశముందనే విషయాలపై స్పష్టత రానుంది. పండుటీగ ప్రయోగం విజయవంతమైతే దాని సాయంతో శాస్త్రవేత్తలు భవిష్యత్‌లో చందమామ, అంగారకుడు, సుదూర ప్రాంతాలకూ మానవసహిత ప్రాజెక్ట్‌లను నిరభ్యంతరంగా చేపట్టే వీలుంది.
పండుటీగలే ఎందుకు?
ఇలాంటి ప్రయోగాలకు పండుటీగలే అత్యంత అనుకూలమని తేలింది. ఎందుకంటే మనిషి డీఎన్‌ఏలో సహజసిద్ధంగా ఉన్న సూక్ష్మస్థాయి లోపల కారణంగానే తరచూ పలు రోగాలు సోకుతాయి. అలా మనిషిలో రోగాలకు కారణమయ్యే జన్యువులు, పండుటీగల్లోని అలాంటి జన్యువులతో దాదాపు 75 శాతం పోలి ఉండటం విశేషం. అందుకే భవిష్యత్ ప్రయోగాలను చేపట్టనున్నారు. పైగా పండుటీగ లార్వా అత్యంత విపత్కర పరిస్థితులను సైతం తట్టుకోగలదు.
అత్యధిక స్థాయి రేడియేషన్‌ను సైతం తట్టుకొని మనగలదని ఇప్పటికే స్పష్టమైంది. ఇంతటి రేడియేషన్‌ను చాలా రకాల జీవులు అస్సలు తట్టుకోలేవు. ఇంతటి విశిష్ట లక్షణాలు ఉన్నందుకే పండుటీగను ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. అంతరిక్షం అనేది మనం రాత్రిళ్లు ఆకాశం కేసి చూసినప్పుడు కనిపించినంత ప్రశాంతంగా ఉండదు. అక్కడ రేడియోధార్మికతను అడ్డుకునే ఎలాంటి వాతావరణం ఉండదు.
అంతటా శూన్యం వ్యాపించి ఉండటంతో రేడియోధార్మికత అనేది నిరాటంకంగా తీక్షణస్థాయిలో ప్రసరిస్తుంది. రేడియేషన్ అనేది మనిషి డీఎన్‌ఏలోని నిచ్చెనలాంటి నిర్మాణాలను దెబ్బతీస్తుంది. గురుత్వాకర్షణ లేని కారణంగా వెంటనే మళ్లీ మరమత్తు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ముప్పు ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందుతూ వ్యోమగాములు వ్యోమనౌకల్లో మనుగడ సాగించాల్సి ఉంటుంది.
అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందే విధానాలపై ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు అవసరం. పండు టీగలోని ప్రోటీన్లు రేడియేషన్‌కు లోనైనా వెంటనే రిపేర్లు చేసుకోగలిగితే ఇదే తరహా ప్రోటీన్లతో శాస్త్రవేత్తలు కొత్తతరం ఔషధాలను అభివృద్ధిచేయనున్నారు. భవిష్యత్తులో వ్యోమగాములకు వీటిని అందించనున్నారు. జూన్ 8వ తేదీన భారత్, అమెరికా, పోలండ్, హంగేరీ దేశాల వ్యోమగాములతో ఆగ్జియమ్–4 క్యాప్సూల్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. మనం తినే పండు చుట్టూ తిరిగే పండుటీగ చుట్టూ మన శాస్త్రవేత్తలు తిరుగుతారని మనం కలలో కూడా ఊహించి ఉండం.
– సాక్షి, నేషనల్ డెస్క్