
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రావల్పిండి అడియాలా జైలు బయట ఆమెపై కోడి గుడ్డు దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సొంత పార్టీ మహిళా కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
తోషాఖానా కేసులో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌తో శుక్రవారం ములాఖత్ అయిన అనంతరం అలీమా జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమెపైకి గుడ్డును విసిరారు. అది ఆమె గదవకు తాకి పగిలిపోయి దుస్తుల మీద పడిపోయింది. గుడ్డు విసిరింది ఎవరు? అంటూ గట్టిగా గదమాయించారు. వెంటనే తేరుకుని ఫర్వాలేదు.. వదిలేయండి అంటూ ఆమె తన ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆమెపైకి గుడ్డు విసిరింది ఇద్దరు మహిళలని, వాళ్లు పీటీఐ మద్దతుదారులేనని, జర్నలిస్టుల గుంపులో వచ్చి గుడ్డు విసిరారని, వాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తయ్యబ్ బాలోచ్ అనే సోషల్ మీడియా జర్నలిస్టు.. అలీమ మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్టులు చేశారు. దీంతో పీటీఐ మద్దతుదారులు ఆ జర్నలిస్టును టార్గెట్ చేశారు. ఇదే విషయమై అలీమాకు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె దాటవేశారు. ‘‘మీడియా అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.. బాలోచ్‌ను బెదిరించడం ఏంటి?.. ప్రశ్నించడమే నేరమా?’’ అని మీడియా ప్రతినిధులు ఆమెను నిలదీశారు. అయినా ఆమె మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఆమెపై గుడ్డు పడింది.
అయితే.. ఈ దాడిని పీటీఐ ఖండించింది. అది తమ కార్యకర్తల పని కాదని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి భయపడే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, PML-N పార్టీ ఈ దాడి చేయించారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు, ఆర్మీ వర్గాలు స్పందించాల్సి ఉంది.
Strongly condemn the disgraceful act of throwing an egg at Aleema Khanum, sister of former Prime Minister Imran Khan. No political disagreement should ever justify such disrespect. Pakistan’s politics need dialogue, not humiliation. #AleemaKhanum #StayStrongAleemaKhan pic.twitter.com/U5e2J1djPc
— SAQIB (@saqibhussaiinn) September 5, 2025
పాక్‌తో తోషాఖానా(ధనాగారం) కేసు సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు.. తోషాఖానాలో ఉన్న విలువైన బహుమతులను దొడ్డిదారిన అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి. రూ. 14 కోట్ల (అంటే సుమారు $500,000) విలువైన బహుమతులను అమ్మినందుకు.. 2023 ఆగస్టులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 8న జరగనుంది.