అక్కడ యాక్సిడెంట్‌ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే!.. భారీ ఫైన్‌ కూడా!!

Dubai Law: Taking Accident Victims Photos Video Now Punishable Offence - Sakshi

నేరాలు, ఘోరాలు కళ్లెదుట జరుగుతున్నా, అడ్డుకోవడం సంగతి పక్కనపెడితే..  వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం తరచూ చూస్తుంటాం. అయితే ఇలాంటి చేష్టలను ఉపేక్షించబోయేది లేదంటూ ప్రకటించింది మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీ యూఏఈ. 

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టం తీసుకొచ్చింది. ఇందుకుగానూ శిక్షగా లక్షా యాభై వేల దుబాయ్‌ దిర్‌హం నుంచి ఐదు లక్షల దిర్‌హంల దాకా జరిమానా. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష. ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్‌క్రైమ్‌ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. 

జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిందంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులకు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఇందుకు మినహాయింపు మాత్రం ఉంటుంది. డిజిటల్‌ యుగంలో ఇలాంటి చేష్టలను ప్రొత్సహించడం మంచిది కాదు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం, ఇతరులకు ఫార్వార్డ్‌ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు అక్కడి అధికారులు. 

ఇంతేకాదు.. అవతలి వాళ్ల అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి చేష్టలపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని కఠినం చేసింది. ఇలాంటి చేష్టలకు ఏడాది జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్‌హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. అలాగే డిజిటల్‌ స్టాకర్స్‌ (ఇంటర్నెట్‌లో వెంటాడి.. వేధించే నిందితులు)కు ఆరు నెలల జైలు శిక్ష, లక్షా యాభై వేల నుంచి ఐదు లక్షల దిర్‌హం దాకా జరిమానా లేదంటే రెండూ విధిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top