వాషింగ్టన్: ఇరాన్‌పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్‌గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం.
గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్‌మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్‌ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.


