
భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్ గత వ్యాఖ్యలను తిరస్కరించారు.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్‌తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్ అన్నారు.
భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు.
ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్‌పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్‌లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు.
ఇంకోవైపు.. అమెరికా వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది.