వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అన్నారు. ముగింపు దశకు చాలా దగ్గరగా ఉన్నట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు. కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. చర్చలకు వచ్చేందుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. ఆ దేశానికి నౌకల రాకపోకలను హార్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.


