వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్‌లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్‌కు దారికి తీసుకురావడం, హార్మూజ్‌ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు.
మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.
హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.


