
ఈబీ–5 కటాఫ్ ఆర్నెల్లు తగ్గింపు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది.
మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్‌సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్‌ను మార్చకపోవడం విశేషం.
ఏమిటీ ఈబీ–5 కేటగిరీ?
అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు.
– సాక్షి, నేషనల్ డెస్క్