బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ గురువారం దక్షిణ కొరియాలో సమావేశం కాబోతున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ బుధవారం వెల్లడించారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు.
దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారు. అమెరికా–చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతికి నూతన వేగాన్ని కల్పిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నట్లు జియాకున్ తెలియజేశారు. సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షీ జిన్‌పింగ్‌తో ముఖాముఖి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం.


