
భారత్, పాక్ సమరానికి స్వస్తి పలికింది నేనేనని మళ్లీ ప్రకటించుకున్న ట్రంప్
ఏడు యుద్ధాల్ని ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పదేపదే అదే విషయాన్ని చెప్పి అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మారిపోయారు. ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అణ్వస్త్రపోరుకు దారితీయకుండా తానొక్కడినే అడ్డంగా నిలబడి యుద్ధానికి ముగింపు పలికానని ట్రంప్ శనివారం మరోమారు ప్రకటించుకున్నారు. ఇలా ప్రకటించుకోవడం ఇది 41వ సారి కావడం గమనార్హం.
ఈ ప్రకటనకు వర్జీనియా రాష్ట్రంలోని మౌంట్ వెర్నాన్ పట్టణంలో జరిగిన ‘అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్స్’ డిన్నర్ కార్యక్రమం వేదికైంది. భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో మొత్తంగా 40 సార్లు ప్రకటించారని వార్తలొచ్చాయి. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల మొద లైన యుద్ధాన్ని మీరొకసారి గుర్తుచేసుకోండి. నేనాయుద్ధాన్ని ఎలా ఆపానో తెలుసా? వాణిజ్యం ఆయుధంతో భయపెట్టి ఆ రెండు దేశాలను తీవ్ర యుద్ధంలో జారిపోకుండా కాపాడా.
నేను ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశా. భారత్, పాకిస్తాన్, థాయ్‌లాండ్, కాంబోడియా, అర్మేనియా, అజర్‌బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, డీఆర్ కాంగో ఇలా ఇన్ని దేశాల మధ్య ఆరంభమైన ఏడు యుద్ధాలను నిలువరించా. వీటిలో 60 శాతం యుద్ధాలను కేవలం వాణిజ్యబూచిని చూపి అడ్డుకున్నా. నెలల తరబడి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నాకు కచ్చితంగా నోబెల్ శాంతి పురస్కారం దక్కుతుందేమో. అసలు నేను ఇప్పటికే 7 యుద్దాలను ఆపానుకదా ఈ లెక్కన ఒక్కో భారీ యుద్ధానికి ఒక నోబెల్ లెక్కేసుకున్నా ఏడు నోబెల్ బహుమతులు రావాలి.
కానీ కొందరు నాతో మరోలా చెప్పారు. ఏడు సంగతి పక్కనబెడితే ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే మాత్రం నోబెల్ తథ్యం అని అన్నారు. వాస్తవానికి ఏడు సమరాలకు ముగింపు పలికడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క యుద్ధం ఆపడమంటే అత్యంత సంక్లిష్ట, సాహసోపేతమైన పని విజయవంతంగా పూర్తిచేసినట్లే. వాస్తవానికి పుతిన్‌తో నాకున్న పాత పరిచయాల కారణంగా ఈ యుద్ధం ఆపడం అత్యంత తేలిక అని గతంలో భావించా. నా నమ్మకా న్ని పుతిన్ వమ్ముచేసి వంచించారు. ఎలాగైనా సరే ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆపి తీరుతా’’ అని ట్రంప్ అన్నారు.