ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు | Congo Cases Surge as WHO Calls for Urgent Global Action | Sakshi
Sakshi News home page

ఎబోలా విలయం: రెండు రోజుల్లో రెండింతలైన కేసులు

Jun 1 2026 8:16 AM | Updated on Jun 1 2026 8:48 AM

Congo Cases Surge as WHO Calls for Urgent Global Action

కిన్షాసా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ మరింతగా విరుచుకుపడుతోంది. తూర్పు ఇటురి ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ మహమ్మారి గడిచిన రెండు రోజుల్లోనే అంచనాలకు మించి వ్యాపించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ స్వయంగా రంగంలోకి దిగారు.

రెట్టింపైన కేసులు.. పెరుగుతున్న ఆందోళన
కాంగోలో ఎబోలా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 48 గంటల వ్యవధిలో కేసులు 121 నుంచి 225కి చేరాయి. ప్రస్తుతం 1,000కి పైగా అనుమానిత కేసులు, 220కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ వైరస్ ‘బుండిబుగ్యో’ అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన రకానికి చెందినది కావడంతో, దీనిని ఎదుర్కోవడం వైద్యులకు సవాలుగా మారింది. ఈ రకం వైరస్‌కు ఇప్పటివరకు ఎటువంటి టీకా కానీ, ప్రత్యేక చికిత్స కానీ అందుబాటులో లేదు.

ఆరోగ్య చర్యలకు ఆడ్డంకులు
వైరస్ నియంత్రణలో వైద్య బృందాలకు స్థానిక ప్రజల నమ్మకం అత్యంత కీలకం. అయితే, వైరస్ పట్ల అపోహలు, భయం, స్థానిక ఆచారాల కారణంగా ఆరోగ్య చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అంత్యక్రియల విషయంలో నిబంధనలను పాటించడం ప్రజలకు కష్టంగా మారుతోంది. మరోవైపు గొడవల కారణంగా  ప్రజల తరలింపు, సహాయక చర్యలు చేపట్టడం అనేవి వైద్యాధికారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి.

సరిహద్దులు దాటుతున్న మహమ్మారి
ఎబోలా ప్రభావం కాంగో సరిహద్దులను దాటి ఉగాండాకు కూడా పాకింది. అక్కడ కూడా కేసులు నమోదవ్వడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక, వైద్య సహాయం అందిస్తున్నప్పటికీ పెరుగుతున్న కేసులకు ఆ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఎబోలా నియంత్రణ ఇప్పుడు కాంగోకు, ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పోలీసులకు చిక్కలేదు.. బాలీవుడ్‌కు దొరకలేదు!

Advertisement
 
Advertisement
Advertisement