ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక | Conflicts End When Leaders Choose Dialogue Over Destruction: Un Chief | Sakshi
Sakshi News home page

ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక

Apr 3 2026 7:23 AM | Updated on Apr 3 2026 10:32 AM

Conflicts End When Leaders Choose Dialogue Over Destruction: Un Chief

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా​-ఇజ్రాయెల్‌ దాడులు, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

'నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాస చీఫ్‌.. తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్‌ను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా.. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో పునరుద్ఘాటించారు.

నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని.. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్‌.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్‌) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని.. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు.

Advertisement
 
Advertisement
Advertisement