టెహ్రాన్: ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
అదే సమయంలో, ట్రంప్ ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప‍్రమాదం ఉందని యూఎస్ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్‌గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్‌గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్‌కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.
ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్‌లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.
చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.
ఇజ్రాయెల్ ఊరుకోదు
ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్‌గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్‌లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.
ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం.
ట్రంప్‌నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్‌కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు?
నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ‍్వాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు.


