
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.
తన భర్త పాడ్‌కాస్ట్‌ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్‌ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.
ఎరికా 2021లో చార్లీ కిర్క్‌ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్‌ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్‌కాస్ట్‌ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్‌తో అన్నారు.