
సింపుల్‌గా....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి
ఇప్పుడేం జరిగింది?
అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్‌లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
నేపథ్యం ఏమిటి?
అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
గత చరిత్ర
అమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.
వర్తమానం... భవిష్యత్తు...
అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్‌తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్‌పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు.