
వెలువడిన లక్ష కోట్ల అణుబాంబుల సమానమైన శక్తి
చంద్రునిపై 2,500 కి.మీ. విస్తీర్ణంలో భారీ గొయ్యి
13 కిలోమీటర్ల లోతు గొయ్యి
ఇదే ప్రాంతం నుంచి శాంపిళ్లను మోసుకొచ్చిన చాంగ్–6 వ్యోమనౌక
చిన్నతనంలో చేసే అతి అల్లరికి అమ్మ ఎప్పుడో ఒకసారి గట్టిగానే కొట్టి ఉంటుంది. అలాగే చల్లని వెన్నెలను మనకు అందించే చందమామ కూడా ఒకప్పుడు భారీ దెబ్బతిన్నాడు. అంతరిక్షంనుంచి విరుచుకుపడిన ఒక ఖగోళ వస్తువు సృష్టించిన పెను ఉత్పాతమది. సౌర కుటుంబ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ తాడనంగా నమోదైంది. గ్రహశకలం లేదంటే తోకచుక్క అనూహ్యంగా దిశ మార్చుకుని వచ్చి చంద్రుడి ఉపరితలంపై అత్యంత వినాశనం సృష్టించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో విరుచుకుపడి మారణహోమానికి పాల్పడింది.
అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే ఏకంగా లక్ష కోట్ల అణుబాంబులకు సమానమైన శక్తితో ఆ గ్రహశకలం/తోకచుక్క చంద్రమామను ఢీకొట్టింది. దీంతో మనం లెక్కించడానికి, ఊహించడానికి కూడా సాధ్యంకానంతటి స్థాయిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి చంద్రుని ఉపరితలంపై 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. అంటే టెక్సాస్ రాష్ట్రంలోని వాకో సిటీ నుంచి వాషింగ్టన్ డీసీ నగరానికి ఉన్నంత దూరం స్థాయిలో ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు ఏకంగా 13 కిలోమీటర్లు. ఇంతటి పెనువినాశనం ఇప్పుడు జరగలేదు. 380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అరుదైన ఖగోళ ఘటన జరిగింది.
మరి ఇప్పుడెందుకీ బిలం గోల?
చంద్రుడు ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడిన బిలం కావడంతో ఆనాటి ఘటన తాలూకు అవశేషాలు సజీవ సాక్ష్యాలుగా అక్కడే ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆనాటి ఘటన తాలూకు ఆధారాలు అలాగే ఉంటాయనడానికి బలమైన కారణం ఉంది. చందమామపై ఎలాంటి వాతావరణం లేదు. గాలులు, వరదలు, కాలుష్యం వంటి కారణంగా అక్కడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు సంభవించబోవు. ఆ లెక్కన ఆనాటి ఖగోళ రహస్యాలు అలాగే భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకే చంద్రుడు ఆవిర్భవించాడు.
ఈ లెక్కన అవని ఆవిర్భావ రహస్యాలు చందమామపై ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు చైనా రంగంలోకి దిగింది. ఈ బిలం ఉన్న ప్రాంతానికి ‘సౌత్ పోల్ ఐట్‌కెన్ బేసిన్’గా పిలుస్తారు. ఇది భూమి మీద నుంచి చూస్తే కనిపించదు. చంద్రుని ఆవలి వైపు ఎప్పుడూ చిమ్మచీకట్లో ఉంటుంది. దీంతో ఇక్కడి శాంపిళ్లను తీసుకురావడం సవాల్‌తో కూడిన పని. ఇంతటి అసాధ్యమైన పనిని చైనా సుసాధ్యంచేస్తూ ఛాంగ్–6 వ్యోమనౌక ద్వారా గత ఏడాది జూన్ 25వ తేదీన అక్కడి నుంచి 1,935 గ్రాముల నమూనాలను తీసుకొచ్చింది. ఈ శాంపిళ్లపై ఏడాదికాలంగా చేసిన పరిశోధన తాలూకు తాజా వివరాలు ‘‘నేచర్’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్