ట్రంప్‌ పోలికలే రక్షించాయి! | Bangladesh Trump Buffalo Saved From Bakrid Sacrifice, Shifted To National Zoo After Viral Fame | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ పోలికలే రక్షించాయి!

May 28 2026 8:50 AM | Updated on May 28 2026 9:25 AM

Bangladesh Viral Trump Buffalo Saved From Bakrid Sacrifice Sent Zoo

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పోలి ఉందంటూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్‌ బఫెలో”కు బక్రీద్‌ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ.. చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.

బంగ్లాదేశ్‌లోని ఢాకా సమీప నారాయణ్‌గంజ్‌లో ఓ ఫారంలో పెంచుతున్న ఈ అరుదైన ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్‌” అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో ఈ గేదె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పిల్లలు, యువత, కుటుంబాలు పెద్దఎత్తున ఫారంకు చేరుకుని సెల్ఫీలు దిగేవారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట.

అయితే ఈద్‌ అల్‌ అదా సందర్భంగా బలి కోసం ఇప్పటికే ఈ గేదెను విక్రయించినట్లు యజమాని జియౌద్దీన్‌ మృధా వెల్లడించారు. “ట్రంప్‌ బఫెలోను మిస్‌ అవుతాను.. కానీ త్యాగమే ఈద్‌ అసలు స్ఫూర్తి” అని ఆయన చెప్పడంతో.. వైరల్‌ స్టార్‌గా మారిన ఈ గేదె కథ విషాదంగా ముగియబోతోందన్న చర్చ మొదలైంది.

కానీ సోషల్‌మీడియాలో పెరిగిన చర్చలు, భారీ ప్రజాదరణ చివరకు ప్రభుత్వాన్ని కదిలించాయి. పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్‌ హోంమంత్రిత్వ శాఖ చివరి క్షణంలో జోక్యం చేసుకుని గేదెను రక్షించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ‘ట్రంప్‌ బఫెలో’ను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. ప్రత్యేక షెడ్‌, కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆల్బినో జంతువులు బంగ్లాదేశ్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్‌ లోపం కారణంగానే వీటికి తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టు వస్తాయని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు పలుమార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని తెలిపారు.

ఇప్పుడు సోషల్‌మీడియాలో ఒక్క ప్రశ్నే వైరల్‌గా మారింది.. “ట్రంప్‌లా కనిపించడం వల్లేనా ఈ గేదె ప్రాణాలు దక్కాయి?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. బలి పీఠం దాకా వెళ్లిన ‘ట్రంప్‌ బఫెలో’ కథ చివరకు జూ వరకూ చేరి హ్యాపీ ఎండింగ్‌ దిశగా మలుపు తిరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement