Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!

Afghan TV presenter tells how Taliban stormed her station - Sakshi

మహిళా జర్నలిస్టు ఉద్యోగులపై వేటు

టీవీ యాంకర్లకు తాలిబన్ల బెదిరింపులు

భద్రతపై ఆందోళనలో స్త్రీలోకం

Afghanistan  Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్‌ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.

తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్‌ మెహ్‌ ముర్సల్‌ అమిరి వెల్లడించారు. అఫ్గాన్‌ నేషనల్‌ టీవీకి చెందిన ఆర్‌టీఏ స్టూడియోస్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్‌కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్‌ వేసుకున్నందుకు, హిజాబ్‌ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు.  ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంధకార భవితవ్యం...
దేశంలో స్త్రీల భవిష్యత్‌ అంధకారంలోకి జారిందని ముర్సల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్‌ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్‌షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్‌ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్‌ చెప్పారు.

స్టేషన్‌లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్‌పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు.  

హక్కులు కోల్పోయాం
పౌర పాలనలో తాను హిజాబ్‌ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్‌ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు.

తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్‌తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు.     

భయంలో మహిళా క్రీడాకారులు
తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్‌ విజ్ఞప్తి
అఫ్గానిస్తాన్‌లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌ షబ్నం మొబరెజ్‌ ఫిఫా(ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్‌ మెంబర్స్‌ అఫ్గాన్‌లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు.

ఫుట్‌బాల్‌ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్‌ మహిళా ఫుట్‌బాల్‌ టీమ్‌ ఏర్పాటైంది. 2012లో ఖతార్‌పై గెలుపుతో ఈ టీమ్‌ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్‌ కిట్స్‌ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ఖలీదా పోపల్‌ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది.
    –నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top