వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.
ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.
దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య గురించి కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.
చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.
కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్‌లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్‌లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్‌ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది.


