
పారిస్: ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఆందోళన చేస్తున్న నిరసన కారుల్ని ఫ్రాన్స్ నూతన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అరెస్టు చేయిస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు. పలు వ్యవస్థల్ని స్తంభించేందుకు ప్రయత్నిస్తున్న వందలమందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ అరెస్టులను మరింత ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్రాన్స్‌లో సైతం నేపాల్ తరహా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఆ దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో దేశ ప్రజల కోసం వివిధ పథకాల్లో కేటాయించే బడ్జెట్‌లో 43.8 బిలియన్ డాలర్లు కోత విధించారు. దీంతో పాటు రెండు రోజుల నేషనల్ హాలిడేస్‌ను రద్దుచేయడం, పెన్షన్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ఫ్రాంకోయి బేరౌ తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది.
ఆ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆగస్టు నెలలో సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్‌లు నిర్వహించారు. ఆ తర్వాత చాపకింద నీరులా సెప్టెంబర్ నెలనుంచి బహిరంగంగా ఆందోళన బాటపట్టారు. ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో మొదలు పెట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపచేసే లక్ష్యంగా నిరసల్ని మరింత ఉదృతం చేశారు.
ఫలితంగా ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌను పదవి నుంచి తొలగించారు. నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమించారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకోర్ను.. ఆందోళనల్ని అరికట్టేందుకు ఎక్కడిక్కడే ఆందోళన కారుల్ని అరెస్టు చేస్తున్నారు. అరెస్టులు, భద్రతా చర్యలు నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు కాగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకర్నో స్పందించారు.దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుంటామని, శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.