పెళ్లంటూ మోసగించి రూ.కోటి కాజేశాడు.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లంటూ మోసగించి రూ.కోటి కాజేశాడు..

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

నవాజ్‌తోపాటు మరో ఇద్దరి అరెస్టు

పంజగుట్ట: నెల్లూరుకు చెందిన నవాజ్‌ అనే వ్యక్తి మతం మారినట్లు బోగస్‌ సర్టిఫికెట్‌ చూపించి తనను మోసగించి పెళ్లి చేసుకుని, కోటి రూపాయల వరకు కాజేశాడని ఓ బాధితురాలు (26) ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లికి చెందిన బాధితురాలు మాట్లాడుతూ తాను సాఫ్ట్‌వేర్‌ డవలపర్‌నని, కూకట్‌పల్లిలో తన ఇంటి కింద ఉన్న షాపులో నవాజ్‌ ట్రేడింగ్‌ సొల్యూషన్‌ ఆఫీస్‌ పెట్టుకుంటానని 2025 మే నెలలో వచ్చి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకే వివాహం చేసుకుంటానని తన వెంటపడ్డాడని పేర్కొంది. హిందువుగా మతం మారానని బోగస్‌ సర్టిఫికెట్‌ చూపించడంతో నమ్మి గత ఏడాది జూలైలో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. వివాహమైనరోజే బేగంపేటకు తీసుకువెళ్లి తనకు జ్యూస్‌లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక నవాజ్‌ సోదరులతో సామూహిక అత్యాచారం చేయించాడని తెలిపింది. శంషాబాద్‌లో ఉన్న తమ ఫ్లాట్‌ అమ్ముకున్నాడని, తమ బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడని, మొత్తం కోటి రూపాయల వరకు మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతనికి అంతకు ముందే రెండు వివాహాలైనట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు. గట్టిగా ప్రశ్నించగా, తన చెల్లిని కూడా ఇలానే గ్యాంగ్‌ రేప్‌ చేయిస్తానని, అమ్మను చంపి సహజ మరణంగా చిత్రీకరిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితునిపై కేసు నమోదైందని పేర్కొంది.

సనత్‌నగర్‌: యువతిని మోసగించిన కేసులో నవాజ్‌తోపాటు అతని సోదరులు ఇస్మాయిల్‌, లీలాపుద్దీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న స్నేహితులు షారూక్‌, మునావర్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నవాజ్‌ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్‌లో ఉన్న నవాజ్‌, ఇస్మాయిల్‌, లీలాపుద్దీన్‌లను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న అనంతరం అన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. బాధితురాలి తల్లి పేరుపై ఉన్న ఇంటిని నవాజ్‌ వేరొకరికి విక్రయించిన విషయంపై ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పోలీసులు లేఖ రాసినట్లు తెలిసింది.

విలేకరుల సమావేశంలోబాధితురాలి ఆవేదన

Advertisement
 
Advertisement
Advertisement