మన్సూరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడంటూ అతడి బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలుపాల గ్రామానికి చెందిన చిక్కా నరేష్(38) కొంతకాలంగా కుంట్లూర్‌లోని నారాయణ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నరేష్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. గుండెలో నొప్పి వస్తోందంటూ అతడు ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతడు ఈ నెల 11న శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేరాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించారు. అయితే బుధవారం రాత్రి 9.30 గంటలకు నరేష్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. కాగా, అనుభవంలేని జూనియర్ డాక్టర్లు శస్త్రచికిత్స చేయడం వల్లే నరేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి బంధువులు, నారాయణ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎల్‌బీనగర్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బందోబస్తు చేపట్టారు.
అదుపులేని రక్తస్రావం వల్లే..
నరేష్‌కు బెంటాల్ సర్జరీ పూర్తయినప్పటికీ, అదుపులేని రక్తస్రావం తలెత్తడంతో విషాదం జరిగిందని, వైద్యపరంగా ఉత్తమ చికిత్సను అందించామని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం, జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారనే ఆరోపణలో నిజం లేదని కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన


