మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇచ్చుకుని.. మాత్రలు వేసుకుని..
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. సీనియర్లు పెట్టిన పని ఒత్తిడి తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. కోర్సుపై అతడికి ఆసక్తి లేకపోవడంతో ఒత్తిడికి గురై ప్రాణం తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. దాదాపు పది నెలల క్రితం కోర్సులో చేరిన అతను ఆఖరి కౌన్సెలింగ్ వరకు కోర్సు మార్చుకోవడానికి ప్రయత్నించారు. మూడు రౌండ్లలోనూ అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలి వెళ్లాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
హాస్టల్ గదిలో అచేతనంగా..
ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన సురేష్ బుధవారం రాత్రి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకుని తన హాస్టల్ గదిలో ఉన్నారు. గురువారం ఉదయం ఆయన తల్లి, కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇక్కడ ఉన్న సురేష్ స్నేహితులకు కుటుంబీకులు విషయం తెలిపారు. వాళ్లు వెళ్లి సురేష్ గది తలుపులు తెరిచి చూడగా అచేతనంగా పడి ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బంధువులు, సహచరుల ఆందోళన..
ఆస్పత్రి వద్ద సురేష్ కుటుంబీకులతో పాటు సహచర విద్యార్థులు నిరసనకు దిగారు. సీనియర్లు అతనితో ఎక్కువ పని గంటలు పని చేయించారని, సుదీర్ఘంగా డ్యూటీలు వేశారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు చేయనీయమని అడ్డుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందించారు. సురేష్ ఆత్మహత్యపై కుటుంబీకులు చేస్తున్న ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకున్నామని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు.


