రూ.కోట్లల్లో సర్కారు సొమ్ము స్వాహా | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లల్లో సర్కారు సొమ్ము స్వాహా

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజన్సీల మాయాజాలం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. లేని ఉద్యోగులను ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

● ఉస్మానియా ఆసుపత్రిలో ప్రభుత్వం అధికారికంగా నెలకు 787 మంది కార్మికులకు వేతనం చెల్లిస్తోందని, వాస్తవంగా పనిచేస్తున్నది సుమారుగా 400 మంది మాత్రమే ఉంటారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.

● ఆరు నెలల క్రితం సిబ్బంది ఎంత మంది పనిచేస్తున్నారు. వారి వివరాలపై ఆరా తీయగా కొంత మంది ఏక కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల్లో పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో ఏజన్సీలను మందలించి, మరో మారు అలా జరగకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

● అయితే ఈదందా ఇక్కడితో ఆగలేదని తాజాగా మరోమారు తేటతెల్లమైపోయింది. రాష్త్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల ఆధార్‌ కార్డులను శాలరీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించనపుడు వేలాది మంది రెండు అంత కంటే ఎక్కువ చోట్ల వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు.

● పేషెంట్‌ కేర్‌ కోసం ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మ్యాన్‌ పవర్‌ను తీసుకుంటున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు రూ.7,500 చెల్లిస్తోంది. వంద పడకలు ఉన్న ఆసుపత్రిలో 45 మంది సిబ్బందిని నియమించాలని నిబంధనలు పెట్టింది.

● ఇందులో సెక్యూరిటీ, శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ విభాగాల్లో సిబ్బంది పనిచేస్తారు. అయితే ఏజన్సీలు ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నట్లు సమాచారం. తప్పుడు నివేదికలతో రూ.కోట్లలో సొమ్ము స్వాహా చేస్తున్నాయన్న ఆరపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమ బాగోతాలు వెలుగు చూస్తాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

● పనిచేస్తున్న కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని, వేతన చెల్లింపుల్లోనూ కోతలు విధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏజెన్సీల మాయాజాలం

ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు లెక్కలు

అక్రమాలపైప్రభుత్వానికి ఫిర్యాదులు

Advertisement
 
Advertisement
Advertisement