ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దాలి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్‌ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్న ‘అరైవ్‌ – అలైవ్‌’ వారోత్సవాల్లో భాగంగా బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాహనదారులు భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ’నో హెల్మెట్‌ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి కఠినంగా అమలు చేయాలన్నారు. స్థానిక ట్రాఫిక్‌ సమస్యలను వాట్సాప్‌ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని, కాబట్టి భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డి.జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ రోడ్డు భద్రత పోలీస్‌ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదనపు డీసీపీ రాములు, ఏసీపీలు, ఎస్‌.హెచ్‌.ఓలు పెద్ద సంఖ్యలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ

అంతకుముందు, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ’బాలల రహదారి భద్రతా దినం’ సందర్భంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12 అగ్రసేన్‌ కూడలిలో సీపీ సజ్జనర్‌ చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే 4 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరింపజేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌

Advertisement
 
Advertisement
Advertisement