● విదేశీ పర్యాటకునితో మంత్రి జూపల్లి ముచ్చట
● చౌమొహల్లా ప్యాలెస్‌లో ఆసక్తికర సన్నివేశం
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్యాలెస్ సందర్శనకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు తారసపడ్డారు. దీంతో మంత్రి అతడితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతోందని మంత్రి ఆయనను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏయే ప్రదేశాలు చూశారని వాకబు చేయగా.. ఇప్పటికే తాము కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించినట్టు ఆ పర్యాటకుడు బదులిచ్చారు. భాగ్యనగర ఆతిథ్యం ఎలా ఉంది? ఇక్కడి వంటకాలు నచ్చాయా? అని మంత్రి వాకబు చేశారు. పర్యాటకుల నుంచి లభించే సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల వద్ద సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు.


