ఈ నెల 18న ప్రారంభం.. ప్రతి శుక్రవారం వైద్యపరీక్షలు
గాంధీ ఆస్పత్రి: అమర్‌నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా సర్టిఫికెట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు అమర్‌నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాత్రికులు నిర్దేశిత మెడికల్ బోర్డు నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఫల్మనాలజీ, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, హారిక, గోపికృష్ణ, శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ యోగేందర్‌లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. వివరాలకు గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డు సెక్షన్ (ఎంఆర్‌డీ)ను సంప్రదించాలి.


