సిటీలో బెంగళూరు పోలీసుల ఆపరేషన్
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు పోలీసులు నగరంలోని మాదాపూర్, కొండాపూర్‌ల్లో నిర్వహించిన ఆపరేషన్ ఓ ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చింది. అక్కడి సేగెహళ్లికి చెందిన వివాహితను మోసం చేసిన మహేష్ అనే వ్యక్తి దాదాపు కిలో బంగారం కాజేశాడు. ఏడాదిన్నర పాటు సాగిన ఈ క్రైమ్ కథలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా నిందితుడు. అతడినీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్‌లోని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌పై దాడి చేసిన ప్రత్యేక బృందం మహేష్‌ను అరెస్టు చేసి, రెండు బ్యాంకులు, మరో ఫైనాన్స్ దుకాణం నుంచి రూ.85.6 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భార్యను వదిలి.. మహిళల్ని టార్గెట్ చేసి...
నిజామాబాద్‌కు చెందిన పి.మహేష్ వివాహితుడు. కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో నివసిస్తూ.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వివాహిత మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. వారిని బ్లాక్‌మెయిల్ చేసి అందినకాడికి దండుకుని విలాసాలకు ఖర్చు చేస్తాడు. ఏడాదిన్నర క్రితం ఇతడికి స్నాప్‌చాట్ ద్వారా బెంగళూరులోని సేగెహళ్లికి చెందిన మహిళతో (32) పరిచయమైంది. ఈమెతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తనను పూర్తిగా నమ్మిన ఆ వివాహిత నమ్మకాన్ని మహేష్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. బెంగళూరులోని పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, నమ్మించి.. ఆమె నుంచి పలు దఫాల్లో దాదాపు కిలో బంగారం తీసుకున్నాడు. ఇందులో కొంత అమ్మేయగా 571 గ్రాముల్ని మాదాపూర్, కొండాపూర్‌ల్లోని రెండు బ్యాంకులు, ఓ ఫైనాన్స్ దుకాణంలో తాకట్టు పెట్టి జల్సాలకు వినియోగించాడు.
భర్త నిలదీయడంతో..
ఇంట్లోని బంగారం కనిపించకపోయేసరికి భర్త నిలదీయడంతో బాధితురాలు మహేష్‌పై ఒత్తిడి చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించిన అతగాడు తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ విషయాన్ని భర్తకు చెప్పడంతో పాటు మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకువెళ్లింది. ఫిబ్రవరి 10న బెంగళూరులోని ఆర్కేపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఓ ప్రత్యేక బృందం నగరానికి వచ్చిన మహేష్‌ను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేసుకువెళ్లింది. దర్యాప్తులో భాగంగా సదరు మహిళను అనంతపురానికి చెందిన స్వామి అనే యువకుడు ఇలాగే మోసం చేసినట్లు తేలింది. అతడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జైలుకు చేరే వరకు మహేష్, స్వామిలకు ఒకరి విషయం మరొకరికి తెలియకపోవడం విశేషం.
మాదాపూర్‌లోని పీజీ అకామిడేషన్‌పై దాడి
సేగెహళ్లి మహిళను ముంచిన మహేష్
మోసగాడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందం
అనంతపురం వాసీ.. కటకటాల్లోకి..


