ఐఎఫ్‌ఎస్‌ వర్సెస్‌ ఐఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఎస్‌ వర్సెస్‌ ఐఆర్‌ఎస్‌

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం

బంజారాహిల్స్‌ పోలీసుల దర్యాప్తు

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో కుక్క పంచాయితీ చివరికి ఠాణాకు చేరింది. బాధిత మహిళా ఐఆర్‌ఎస్‌, పోలీసుల మాటల్లోనే పూర్తి వివరాలు.. ‘2016 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎస్‌పీ సుతన్‌ సైఫాబాద్‌లోని అరణ్య భవన్‌లో విధులు నిర్వర్తిస్తూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఇదే క్వార్టర్స్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారి నితికాసింగ్‌ సైతం నివసిస్తున్నారు. సుతన్‌ క్వార్టర్స్‌లో న్యూసెన్స్‌ చేసేవారు. రెండు రోజుల క్రితం నితికాసింగ్‌ క్వార్టర్‌ వద్దకు వచ్చి హంగామా చేశారు. ఆమె పెంపుడు కుక్క తన ఇంటి వద్ద అపరిశుభ్రతకు కారణమైందని మండిపడ్డాడు. ఇంటి సిబ్బందితో పాటు పెంపుడు కుక్కపై దురుసుగా ప్రవర్తించారు. నితికాసింగ్‌ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఆమె ఇంటి వద్ద పూల కుండీని పగులగొట్టారు. సుతన్‌ న్యూసెన్స్‌ను తట్టుకోలేక బాధిత ఐఆర్‌ఎస్‌ అధికారిణి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుతన్‌పై బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్లు 75, 79, 324 (4), 351 (2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం బుధవారం సుతన్‌ను ఠాణాకు పిలిపించారు. ఆయనకు డ్రగ్‌ టెస్ట్‌ చేసి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. సుతన్‌ ప్రవర్తన అసహజంగా ఉండటంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు గతంలో ఆయనను సెలవుపై పంపించినట్లు గుర్తించారు. ఇటీవల చికిత్స చేయించుకుని మళ్లీ విధుల్లో చేరారు. తాజాగా ఆయన మీద కేసు నమోదు కావడంతో అరణ్య భవన్‌ నుంచి దూలపల్లి అటవీ ప్రాంతానికి మంగళవారం బదిలీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సుతన్‌ (33) అవివాహితుడని తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్‌ పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement