ఆ భూముల్లో జోక్యం చేసుకోవద్దు
గుట్టలబేగంపేట స్థలాలపై హైడ్రాకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 16లో 10.20 ఎకరాల భూమిలో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 23కు వాయిదా వేసింది. తమ పట్టా భూమి సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటూ హైడ్రా ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తోందని హైదరాబాద్ జూబ్లిహిల్స్‌కు చెందిన వై.అంతిరెడ్డితోపాటు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మదన్‌మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో భూమి ఉందంటూ ఫెన్సింగ్ వేయడానికి హైడ్రా జేసీబీలను తీసుకొచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలున్నాయంటూ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్నారు. దీంతో పిటిషన్లు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని అడిగారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2010, మే 7 నాటి ఆమోదపత్రం మేరకు పిటిషనర్లకు ఆ భూమిపై హక్కు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 10.20 ఎకరాల్లో జోక్యం చేసుకోవద్దని హైడ్రాతో పాటు మున్సిపల్ అధికారులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు.


