వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
గన్‌ఫౌండ్రీ: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ సెలబ్రేషన్స్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సాంకేతిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా పనిచేస్తున్నామన్నారు. వైజ్ఞానికంగా ముందుచూపుతో సమాజాన్ని ముందుకు నడిపించిన పండిట్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధానిగా పని చేయడం మన అదృష్టమన్నారు. నెహ్రూ ప్రంచవర్ష ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంతో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సోషలిజం, ప్రజాస్వామం అంశాలను రాజ్యాంగంలో మేళవించి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. ఇంత పెద్ద దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎవరు మెజారిటీ సాధిస్తే వారికి ఓ మంచి వాతావరణంలో అధికార బదలాయింపు జరుగుతుంది. అందుకు కారణం నెహ్రూ దార్శనికతతో కూడిన విధానాలే అని భట్టి పేర్కొన్నారు. హోమి బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి ప్రముఖులను ఆహ్వానించి ఐఐటీలను స్థాపించి ముందుకు తీసుకువెళ్లారని వివరించారు. సైన్స్, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకొని నెహ్రూ, ఇందిరాగాంధీలు అనేక కేంద్ర సంస్థలను స్థాపించారని, వారి నిర్ణయం ఫలితంగా హైదరాబాద్‌లో ప్రధాన పరిశ్రమలకు అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయని వెల్లడించారు. యూజీసీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని నెలకొల్పారని, అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దేశ అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపద వస్తే దీపాలు వెలిగించండి, చప్పుళ్లు చేయండి అనడం చూస్తుంటే ఈ దేశం ఎటు వెళ్లిపోతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్శిటీ పనులను వేగవంతంగా చేపడుతున్నామని, ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుస్తున్నట్లు వివరించారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలో విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభించి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. అనంతరం విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ ప్రొఫెసర్ రియాజ్, ట్రైకార్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


