ఓటములే పాఠాంగా..
● మూడో ప్రయత్నంలో నవీన్ జయకేతనం
● కలిసి వచ్చిన మజ్లిస్ మైత్రీ బంధం
● స్థానికత, అభివృద్ధి మంత్రం అదనం
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్ ఘన విజయం సాధించారు. ముచ్చటగా మూడుసార్లు పోటీ చేసిన ఆయన.. ఈసారి మాత్రం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యత ప్రదర్శించి విజయబావుటా ఎగుర వేశారు. సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను రెండో స్థానానికి పరిమితం చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి డిపాజిట్ గల్లంతయింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన నవీన్‌కుమార్ యాదవ్.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో మైత్రి కారణంగా మజ్లిస్ ఎన్నికల బరిలోకి దిగలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కలేదు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను కాంగ్రెస్ బరిలో దింపింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది ఆయన అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఆది నుంచీ వ్యూహాత్మకంగానే..
కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన నవీన్ యాదవ్‌కు మజ్లిస్ పాత మైత్రీ బంధం కలిసి వచ్చింది. అధికార కాంగ్రెస్‌తో సత్సంబంధాల కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటించింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే మజ్లిస్ అధినేత అసదుద్దీనన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగడం లేదు కానీ, సమర్థుడైన యువనేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించడంతో మజ్లిస్ మద్దతు కాంగ్రెస్‌కేనని చెప్పకనే చెప్పారు. నవీన్ అభ్యర్థిత్వం ఖరారు అనంతరం ఏకంగా మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార రంగంలో దిగారు. తమకు పట్టున్న డివిజన్లలో విస్తృతంగా పర్యటించి సంప్రదాయ మజ్లిస్ ఓట్లను కాంగ్రెస్‌కు క్రాస్ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మరోవైపు స్థానికత, సామాజిక కార్యక్రమాలు, బీసీ కార్డు, అభివృద్ధి మంత్రం, వామ పక్షాల, బీసీ సంఘాల మద్దతు కూడా నవీన్‌ను విజయతీరాలకు చేర్చిందనే చెప్పవచ్చు. డివిజన్‌కో మంత్రి, నలుగు రు ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులను రంగంలోకి దించడం.. ఆఖరులో సీఎం రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తించడం.. దీనికితోడు అంగ, అర్థబలం కూడా కలిసిరావడంతో నవీన్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది.
అజహరుద్దీన్‌న తప్పించి.. మంత్రి పదవి ఇచ్చి..
నవీన్‌కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్.. ఏకంగా అజహరుద్దీన్‌ను ఉప ఎన్నికల బరి నుంచి తప్పించింది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికుడైన నవీన్‌కు అవకాశం కల్సి వచ్చినట్లయింది. వాస్తవంగా కాంగ్రెస్ అధికార పార్టీ కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, హేమాహేమీలు టికెట్ కోసం పోటీ పడ్డారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో.. ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి ఎన్నికల బరి నుంచి తప్పించింది. దీంతో నవీన్ యాదవ్‌కు లైన్‌క్లియరైంది. ఆ తర్వాత అజహర్‌కు మంత్రి పదవి కూడా లభించడంతో మైనారిటీ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు మరింత కలిసి వచ్చి భారీ విజయం దక్కింది.


