నమ్మి ఇంటికి రానిస్తే హతమార్చాడు..
● గృహిణి హత్య కేసును చేధించిన పోలీసులు
● నిందితుడు దగ్గరి బంధువే
● అప్పులు తీర్చే మార్గం లేక..
నగల కోసం దారుణం
జీడిమెట్ల: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఈ నెల 12న జరిగిన గృహిణి హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్‌కుమార్ తెల్పిన మేరకు..ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన నిహారిక (21)కు సంవత్సరం క్రితం దేవేందర్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరు జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నారు. కాగా వీరి గ్రామానికే చెందిన బంధువు శివమాధవ రెడ్డి(23) ఇంజినీరింగ్ చదివాడు. అప్పుడపుడు నిహారిక ఇంటికి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు..
శివమాధవరెడ్డి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. తాగుడుకు బానిస అయ్యాడు. ఇటీవల ఒత్తిడి పెరగడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బంధువైన నిహారికను హత్య చేసి ఆమె బంగారాన్ని దొంగిలించాలని పథకం పన్నాడు. ఈ నెల 12న నిహారిక భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జగద్గిరిగుట్టలోని ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడి సినిమా చూశాడు. అనంతరం అదును చూసి ఆమె గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి హత్య చేశాడు. హత్యను పక్కదారి పట్టించేందుకు మాధవరెడ్డి నిహారిక మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు కిందపడేశాడు. నల్లా విప్పి బకెట్‌లో నీరు పడుతున్నట్లుగా నల్లా ఓపెన్ పెట్టాడు. బాత్‌రూం లోపలి నుండి గడియ పెట్టేందుకు ట్రై చేయగా సాధ్యం కాలేదు. అనంతరం నిహారికకు చెందిన నాలుగు తులాల బంగారు నగలు, రూ.2500 నగదు తీసుకుని అక్కడ నుండి ఉడాయించాడు. సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త దేవేందర్‌రెడ్డి నిహారిక బాత్‌రూంలో మృతిచెంది పడి ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిహారికకు చెంది న బంగారు నగలు లేకపోవడాన్ని గమనించారు. అదేవిధంగా పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయాలై గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కాల్‌డేటా, సెల్‌ఫోన్ లొకేషన్ వంటి సాంకేతిక ఆధారాలతో శివ మాధవరెడ్డి ఈ హత్య చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తానే నిహారికను హత్యచేసినట్లు విచారణలో శివ మాధవరెడ్డి ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు శివమాధవ రెడ్డిపె కేసు నమో దు చేసి నిందితుడి నుండి ఒక బుల్లెట్ వాహనం, స్వెటర్, బంగారం కుదవపెట్టిన రశీదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


