‘మీ డబ్బు–మీ హక్కు’ మంచి అవకాశం
ఇబ్రహీంపట్నం రూరల్: అన్ క్లెయిమ్ డిపాజిట్లకు ‘మీ డబ్బు, మీ హక్కు’ ద్వారా పరిష్కార మార్గం దొరికిందని, ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మీ డబ్బు, మీ హక్కు అనే థీమ్‌తో అన్‌క్లెయిమ్ డిపాజిట్ల పరిష్కారంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, డివిడెండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా ఆదాయాలు క్లెయిమ్ చేసుకోవాలన్నారు. హక్కుదారులు తమ బ్యాంకులను లేదా ఇతర సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందాలని, ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్‌బీఐ డీజీఎం ప్రయబ్రత మిశ్రా మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులు వాటి చట్టబద్ధమైన యజమానులకు తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ఏజీఎం పద్మజారాణి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఆర్థిక పారదర్శతను నిర్ధారించడానికి వారి సంబంధిత కమ్యూనిటీల్లో అవగహనను వ్యాప్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సరైన హక్కు దారులకు సెటిల్‌మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం సుశీల్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, శ్రీలక్ష్మి, రామారావు, ఉష, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్


