విద్యార్థులు సోషల్ మీడియాకు ఆకర్షితులు కావొద్దు
గచ్చిబౌలి: సోషల్ మీడియాలో వచ్చే అంశాలకు విద్యార్థులు ఆకర్షితులు కావొద్దని, వాటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ రెసోఫెస్ట్–2025 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలో జీవితం టెక్నాలజీపై ఆధారపడి ఉందన్నారు. ఇష్టం ఉన్న వృత్తిని ఎంచుకొని కలలను సాకారం చేసుకోవాలన్నారు. నగరం, గ్రామాల మధ్య అంతరం పెరుగుతుందని, యువత గ్రామీణ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యా ప్రయాణంలో ఇంటర్ ఫైనల్స్‌తో పాటు ఎంసెట్, జేఈఈ అత్యంత కీలకమన్నారు. పోటీ పరీక్షలలో ఆశించిన ర్యాంక్ రాకపోయినా నిరుత్సాహ పడవద్దని, ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశం తత్వశాస్త్రం, విజ్ఞానం, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, బాధ్యతతో జీవించే గుణాలను పెంపొందించే సమగ్ర విద్యను తాము అందిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు రెసోనెన్స్ కొత్త క్యాంపస్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ


